గతంతో పోలిస్తే ఎండాకాలం చుర్రుమనిపిస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మండుతున్న ఎండలతో ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందంటే ఎండల తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతిచెందారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన విఠల్ వడదెబ్బతో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రడగండాల బస్తీకి చెందిన సంపత్ అనే టెక్నికల్ అసిస్టెంట్ వడదెబ్బకు గురై మరణించాడు.
ఆదిలాబాద్ అర్బన్ లో 43.7 డిగ్రీలు, జైనాథ్ లో 43.6 డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరమెరి లో43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, కౌటాల లో 43.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా లింగాపూర్ లో 43.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలికాలంలోనూ ఈ ప్రాంతాల్లోనే అత్యల్ప ఉష్ణోగత్రలు నమోదు కావడం విశేషం. ఇదిలా వుంటే.. కోవిడ్ తరహాలోనే జనం బయటకు వెళ్ళవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు రోజుల పాటు హీట్ అలర్ట్ ప్రకటించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రజలు సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. మధ్యాహ్నం 12-3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దు, ఈ సమయంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగరీత్యా బయట తిరిగే వారు వడదెబ్బ తగల కుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 1-2 తేదీలలో హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు కూడా వడదెబ్బ హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. వడదెబ్బ బాధితులపై నిఘా ఉంచేందుకు రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, నిఘా బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.