ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. కొందరు అమాయకులు గూగుల్‌లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసి దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో ఓ విద్యార్థి కూడా ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ వద్ద కమీషన్ పేరుతో 99,232 రూపాయలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. గత నెల 5వ తేదీన పార్ట్ టైం జాబ్ కోసం సుంకరి సాగర్ గూగుల్‌లో సెర్చ్ చేశాడు. ఈ సందర్భంగా వెబ్‌సైట్‌లో అతడు పార్ట్ టైమ్ జాబ్ కోసం తన ఫోన్ నంబర్ వివరాలను ఇచ్చాడు. దీంతో అమెజాన్ ఆపరేషన్ సర్వీస్ పేరుతో అతడికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపించారు. మూడు టాస్కులు పూర్తి చేస్తే రూ.1.51 లక్షలు చెల్లిస్తామని నమ్మించారు. ఈ మేరకు బాధితుడు సాగర్ మూడు టాస్కులు పూర్తిచేసి ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా విడతల వారీగా రూ.99,232 నగదును చెల్లించాడు. మరో రూ.10వేలు చెల్లిస్తే రూ.2 లక్షలు కమీషన్ వస్తుందని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. అయితే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సాగర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
