Srinivas Goud Demands Kishan Reddy To Say Sorry To Kavitha: ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ అడిగిన ఫోన్లను కవిత విచారణకు తీసుకెళ్లారని.. ఇప్పుడు కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని.. ఇందుకు ఆయన బహిరంగంగా కవితమ్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలను గౌరవిస్తాం అని గొప్పలు చెప్తారు.. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతారు?’’ అని నిలదీశారు. ‘మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేక భ్రమించి మాట్లాడుతున్నారా’ అని ఫైర్ అయ్యారు.
Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
ఒక ఆడబిడ్డను లేని పోని మాటలతో కించపరిచారని.. మహిళ గోప్యత, ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. విచారణకు ముందే, ఫోన్ల విషయం ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని.. అడ బిడ్డపై ప్రతాపం చూపెడతారా? అంటూ ధ్వజమెత్తారు. వేల కోట్లు ఎగవేసిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, అదానీలు ఎక్కడ వెళ్లారని.. వాళ్ల స్కాంలపై విచారణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీ మిత్రులను వదిలేసి.. తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలేశారని ఆరోపించారు. ఆడపిల్ల అని కనికరం లేకుండా.. గంటలు గంటలుగా విచారణ జరిపారని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తప్పుడు ఆధారాలు సృష్టించి, అప్రతిష్ట పాలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉగాది పండుగ ఉందనే కనికరం కూడా లేదని.. మీకు తగిన శాస్తి, పాపం తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారని.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలని కోరారు. కవితను కేసుల పేరుతో వేధిస్తున్నారన్న ఆయన.. తాము బెదిరింపులకు ఏమాత్రం భయపడమని తెగేసి చెప్పారు.