Minister Sridhar Babu : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అమలుపై కట్టుబాటుతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ భోజనం, మెరుగైన వసతులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 3 లక్షలకుపైగా అడ్మిషన్లు నమోదు కావడం ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
