Grama Panchayathi: గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. నిన్నటితో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. నిన్నటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించంది. దీంతో రేపు బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు అధికారులు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, డీటీ, ఆర్‌ఐ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ఉన్నతాధికారులు నియమించారు.
Read also: Budget 2024 : 11.1 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్.. సైనిక బలాన్ని పెంచేందుకు రూ.1,11,111 కోట్ల కేటాయింపు
ఈరోజు సాయంత్రం సర్పంచ్‌ల వద్ద ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతర రికార్డులన్నీ సీజ్ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక అధికారి, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. డిజిటల్ కీకి అధీకృత అధికారిగా ప్రత్యేక అధికారి ఉంటారు. డిజిటల్ కీ, చెక్కులు, రికార్డుల్లో ఏదైనా సమస్య తలెత్తితే కార్యదర్శిదే బాధ్యత అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో వచ్చే నిధులన్నింటికీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న 2011 నుంచి 2013 వరకు, 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
Read also: Hemant Soren: ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఝార్ఖండ్ మాజీ సీఎం!
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హనుమకొండ జిల్లాలో 208, వరంగల్ జిల్లాలో 323, మహబూబాబాద్ జిల్లాలో 461, జనగామ జిల్లాలో 281, ములుగు జిల్లాలో 173, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 241 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అధికారులను గుర్తించి మండలాల వారీగా జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తహసీల్దార్, ఎంపీడీఓ, పీఆర్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ ఏఈలు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఎంపీఓలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. వీరికి రేపు గ్రామ పంచాయతీల పరిపాలన బాధ్యతలు అప్పగించనున్నారు.
Special Bus for Men: పురుషులకు మాత్రమే.. ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్ రూట్‌లో బస్సు సర్వీసు..!