Soyam Bapu Rao Comments On Bandi Sanjay Padayatra: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు పులులు తిరుగుతున్నాయని.. అందులో బండి సంజయ్ ఒకరని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యానించారు. భూములు కబ్జాలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకులను వేటాడడానికి, వారి ఆగడాలను ప్రజలకు తెలియజేసేందుకు బండి సంజయ్ తిరుగుతున్నాడని అన్నారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. చిరుతపులుల్లా మీరంతా టీఆర్ఎస్ నాయకుల్ని వేటాడాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేస్తానంటూ.. రుణమాఫీ చేయకుండా రైతు సోదరుల్ని మోసం చేశాడని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా.. మీరంతా నిద్రపోకుండా పని చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
అంతకుముందు.. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సమయంలోనూ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమన్న ఆయన.. ఎంఐఎంకు భయపడే యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా.. ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ వణికి పోతున్నారన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందని, బండి సంజయ్ని అడ్డుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని తీవ్రంగా హెచ్చరించారు.