NTV Telugu Site icon

Bandi Sanjay: సోమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి

Bandi Sanjay Somesh Kumar

Bandi Sanjay Somesh Kumar

Bandi Sanjay: తక్షణమే తన పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సూచిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్ ను సీఎస్ బాధ్యతల నుండి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికమని తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదు. తన రాజకీయ అవసరాల కోసం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

Read also: Revanth Reddy: సోమేష్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలి.. రేవంత్ ట్విట్

తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారు. 317 జీవోసహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారన్నారు. అదే విధంగా హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను పావుగా వాడుకున్నారని తెలిపారు. సోమేశ్ కుమార్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా చీఫ్ సెక్రటరీగా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సోమేశ్ కుమార్ కు ఒక న్యాయమా? ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణ కేటాయించి వ్యక్తిని సీఎస్ గా నియమించాలని తెలిపారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలి. అలాగే.. తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేసిందని బండిసంజయ్‌ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
Cashews Benefits: ఇవి రోజూ తింటే.. పురుషుల్లో ఆ సమస్యలు దూరం