హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వివాహం జరిగిన పది నెలలకే వరకట్న వేధింపుల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ ఫ్లాట్ నెంబర్ 158లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయ్‌తో నిఖితకు వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 10 లక్షల నగదుతో పాటు 35 తులాల బంగారాన్ని నిఖిత తల్లిదండ్రులు కట్నంగా సమర్పించారు.
అయితే వివాహం జరిగిన కొన్ని నెలలకే నిఖిత తండ్రి పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని తనకు ఇవ్వాలని భర్త ఉదయ్ తన భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం అర్ధరాత్రి తమ కుమార్తె మృతదేహంతో నిఖిత తల్లిదండ్రులు అల్లుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిఖిత ఆత్మహత్యకు కారణమైన ఉదయ్, అతడి కుటుంబ సభ్యులను శిక్షించాలని కోరుతూ నిరసన తెలిపారు. అయితే హైదరాబాద్‌లో నిఖిత మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు అత్తగారింటి దగ్గర చేయడానికి తీసుకురాగా పోలీసులు అడ్డగించి మృతదేహాన్ని కస్బెకట్కూరుకు తరలించాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.