సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ మేరకు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించాయి.
సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరించడాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణను ఆపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే తమ సత్తా చూపిస్తామని కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నారు. గత ఏడాది కూడా సింగరేణి ప్రైవేటీకరణపై కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
