Bhatti Vikramarka : ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణికి కొత్త ఊపిరి

  • పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి
  • భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం
  • 20 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తికి అవకాశం
  • 2 వేల మందికి ఉపాధి భరోసా
Bhatti Vikramaraka

Bhatti Vikramaraka

ప్ర‌జా ప్ర‌భుత్వ పాలనలో సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌తో పాటు రాష్ట్ర ఇంధ‌న భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయ‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన వేలంలో మ‌ణుగూరు ఏరియాకు అతి కీల‌క‌మైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ను సింగ‌రేణి ద‌క్కించుకోవ‌డం చారిత్ర‌క విజ‌యమ‌ని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, ఈ మైలురాయిపై హర్షం వ్యక్తం చేశారు.

నెల రోజుల్లో రెండో చారిత్రక విజయం

సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ అనుమతుల కోసం తానే స్వయంగా వెళ్లి అక్కడి ప్రజలను, ప్రజాప్రతినిధులను ఒప్పించి, 36 ఏళ్ల పాటు సంస్థకు పునాది వేసేలా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వం విస్మరించిన తాడిచ‌ర్ల-2 బ్లాక్‌కు కేంద్రంతో మాట్లాడి మైనింగ్ లీజు సాధించామని, దీని ద్వారా 45 ఏళ్ల పాటు 336 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు వెలికితీయవచ్చని వివరించారు. తాజాగా మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ దక్కడం నెల వ్యవధిలోనే సింగరేణి సాధించిన రెండో అతిపెద్ద విజయమని తెలిపారు.

మణుగూరు ప్రాంతానికి 20 ఏళ్ల భరోసా

గత పాలకులు సింగరేణి వేలంలో పాల్గొనకుండా అడ్డుకుని, రాష్ట్ర బొగ్గు బ్లాకులను అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలు చేశారని భట్టి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక సింగరేణిని వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించడం వల్లే దాదాపు 12 ఏళ్ల తర్వాత వేలంలో ఈ బ్లాక్ దక్కిందన్నారు. మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ గని ద్వారా ఏటా 6 మిలియ‌న్ల టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు మొత్తం 120 మిలియ‌న్ ట‌న్నుల నాణ్య‌మైన జీ-8 గ్రేడ్‌ బొగ్గును వెలికితీసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల దాదాపు 2,000 మందికి పైగా కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భ‌ద్ర‌త దక్కడమే కాకుండా, మణుగూరు ఏరియా మనుగడకు, ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేసినట్లవుతుందని స్పష్టం చేశారు.

కోయగూడెం-3, సత్తుపల్లి-3 సాధించడమే తదుపరి లక్ష్యం

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ పరమైన కోయ‌గూడెం-3, స‌త్తుప‌ల్లి-3 బొగ్గు బ్లాక్‌ల‌ను కూడా భవిష్యత్తులో తిరిగి సింగ‌రేణికి ద‌క్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనుల సాధనతో పాటు ఇతర క్రిటికల్ మినరల్స్ అన్వేషణ దిశగా సింగరేణిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిని మరింత బలోపేతం చేయడమే తమ ప్రాధాన్యమని పేరొన్న భట్టి విక్రమార్క, ఈ ఘనత సాధించిన సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.