Singareni : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఏరియాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీకే 5 ఇంక్లైన్ గనిలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పు అంటుకుని విషవాయువులు వెలువడటంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మొదటి షిఫ్ట్ ముగిసే సమయంలో జరిగింది. గనిలో వెల్డింగ్ చేస్తున్న అన్వేష్ మరియు ప్రదీప్ అనే కార్మికులకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం కష్టమై అస్వస్థతకు లోనయ్యారు. వారిని వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Fraud : అమాయక పనిమనిషికి గాలం.. ఐదు కోట్ల విలువ చేసే భూమి ఐదు లక్షలకు రిజిస్ట్రేషన్..
అయితే, ఈ ప్రమాదం గురించి అధికారులు విషయాన్ని తొలుత గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. రెండో షిఫ్ట్‌లో విధులకు వచ్చిన కార్మికులను అధికారులు పనిలోకి పంపగా, గనిలో పరిస్థితులు సరిగా లేకపోవడంతో సుమారు పదిమంది కార్మికులు తిరిగి పైకి వచ్చారు. విషయం తీవ్రతను గుర్తించిన తర్వాతే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇటీవలే కేటీకే 6 ఇంక్లైన్ గనిలో పైకప్పు కూలి ఒక కార్మికుడు అస్వస్థతకు గురైన సంఘటన మరువకముందే ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, సరైన భద్రతా సూచనలు పాటించకపోవడం వల్లే తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో భద్రతా చర్యలపై మరింత కఠినంగా వ్యవహరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.