రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది… విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్ ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వివరించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా, షాద్‌నగర్ లోని రాంనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. పనుల కోసం ఫరూఖ్‌నగర్ మండలపరిధిలోని ఉప్పరిగడ్డ గ్రామానికి చెందిన శ్రీను, కృష్ణ, రాజు సోమవారం కూలీ పనుల నిమిత్తం తమ కుటుంబసభ్యులతో కలిసి షాద్‌నగర్‌కు వచ్చారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో భాగంగా పైప్ లైన్లు బిగించడానికి పనులు కుదుర్చుకున్నారు. సుమారు 19అడుగుల లోతులో గుంతలు తీసి మట్టిని పక్కనే పోశారు. పైప్‌లైన్లు బిగించడానికి శ్రీను, కృష్ణ, రాజు ముగ్గురు గుంతలోకి దిగారు. వారు గుంతలోని మట్టిని తీసి జేసీబీ బొక్కెనలో పోస్తున్నారు. గుంత పక్కనే పైన మట్టి ఒక్కసారిగా కూలీలపై పడటంతో అందులో వారు కూరుకుపోయారు. ఈ సంఘటనలో శ్రీను, కృష్ణ అక్కడి కక్కడే మృతిచెందడం విషాదంగా మారిపోయింది.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై వేటు వేసింది. ఆ ఘటనపై విచారణకి ఆదేశించింది మున్సిపల్ శాఖ.. షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా సైఫుల్హాకు బాధ్యతలు అప్పదించారు.. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ వాఖ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.