Secunderabad: మరో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రూ.699 కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తుది మెరుగులు తీర్చిదిద్దే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి రైల్వేశాఖ అప్పగించింది. భవన నిర్మాణ రూపకల్పన ప్రూఫ్ కన్సల్టెంట్‌గా ఐఐటీ ఢిల్లీని నియమించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాజేష్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పని ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు.
Read Also: Football Player: ఇరాన్ సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్ ఆటగాడికి మరణశిక్ష
మొదటిదశలో రైల్వేస్టేషన్ భవనాన్ని ఎలా చేపట్టాలి అనే విషయంపై తుది రూపు ఇచ్చేందుకు లీడ్ డిజైన్ డైరెక్టర్, సేఫ్టీ, ప్రూఫ్ కన్సల్టెంట్‌లను అధికారులు నియమించారు. అక్టోబర్ 2025 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనుల పురోగతిని అన్ని స్థాయిల్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ పరిశీలిస్తున్నారు. వివిధ రకాల ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేసి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు జీఎం వెల్లడించారు. కాగా ఆర్పీఎఫ్ ఆర్మరీ, క్యాష్ గార్డుల భవనం కోసం ఉన్న రైల్వే క్వార్టర్స్‌ను కూల్చేసి చదును చేశారు.
