ఇటీవల కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీకి అందింది.. అయితే.. సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం లో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి నిందితుడితో పాటు A13 నుండి A56 వరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. A2 నుండి A 12 వరకు పరారీ ఉన్నారని, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1 మధుసూధన్ ఉన్నట్లు తెలిపారు. అల్లర్లలో 18 మంది ప్రత్యక్ష సాక్షులుగా చేర్చిన పోలీసులు.. 56 మంది నిందితులు ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
అగ్నిపథ్ లంచ్ కావడంతో, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, ఛలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ గ్రూప్, CEE సోల్జర్ పేర్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసిన అభ్యర్థులు.. ఆ గ్రూపుల ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు. అభ్యర్థులకు పలు ప్రైవేట్ డిఫెన్స్ ఆకాడమీలు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ ప్లాన్ లో భాగంగా ఉదయం 8.30 నిమిషాలకు కలువాలని నిర్ణయించుకున్నా. ఘటన రోజు ఉదయం స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెంబర్ 1, 3 నుంచి ఎంట్రీ ఇచ్చి.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిరసన కారులపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బుల్లెట్ తగిలి రాకెష్ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయని, దర్యాప్తులో ఉద్యోగార్థులను ప్రైవేట్ అకాడమీ వారే రెచ్చగొట్టినట్లు తేలిందన్నారు. బీహార్ లో జరిగిన అలర్లను వాట్సప్ గ్రూప్ లలో ప్రచారం చేశారని, స్టేషన్ కు వచ్చే సమయంలోనే పెట్రోల్ వెంట తేవాలని కొంత మంది సూచనలు చేశారన్నారు.
విధ్వంసం కారణంగా రైల్వే శాఖకు 20 కోట్ల నష్టం వాటిలిందని పోలీసుల తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు రిమాండ్ రిపోర్ట్ లో కనిపించలేదు. ఈ నెల 17న 12 గంటల సమయంలో స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు చేశాడు. ఉదయం 2వేల మంది బోయగూడ వైపు స్టేషన్ లోకి ఎంట్రీ అయ్యారు. లోపలకి వచ్చిన అనంతరం నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అందులో కొంత మంది రైలు ఇంజిన్, కోచ్ ల పై రాళ్లు విసిరారు. ఆ టైం లో స్టేషన్ లో ధనపూర్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరి కొన్ని రైళ్లు ఫ్లాట్ ఫామ్‌లపై ఉన్నాయి. ఒక్కసారిగా ఉద్యోగార్థులు చేతుల్లో రాడ్లు, కర్రలు పట్టుకొని రైళ్ళ పై దాడులు చేశారు.
ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 పై ఉన్న రైల్లో 4 వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ, 3వేల లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ తో ఉన్న రెండు ఇంజిన్ లు ఉన్నాయి. సమూహంలో కొంత మంది ఆ రెండు ఇంజిన్ లకు నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. పోలీస్ సిబ్బంది అడ్డుకునే క్రమంలో పోలీస్ పై రాళ్ళ దాడి చేశారు. రెండు ఇంజిన్ లకు నిప్పు అంటుకుంటే భారీ నష్టం జరుగుతుందని భావించిన పోలీసులు కాల్పులు జరిపారు అని ఆయన పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.