Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: అమ్మవారిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయటం దుర్మార్గం

Talasani

Talasani

అమ్మ‌వారి విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మండి ప‌డ్డారు. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటించారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశించారు. అనంతరం ఉజ్జయిని ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆలయంలో మూల విరాట్‌ మార్పు ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిని అమ్మవారే చూసుకుంటారని వెల్లడించారు. అమ్మవారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయటం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కొందరు కావాలనే ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం తొలగింపు ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. విగ్రహం తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు రోడ్లెక్కడం విడ్డూరంగా ఉందని చెప్పారు. గాంధీ విగ్రహ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ చేస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామ‌ని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రైయివేట్ ఆలయాలకు కూడా నిధులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మ‌న‌దే అన్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రం మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాదిమంది తరలివస్తారని.. వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం కూడా బోనాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

Balka Suman: అమిత్ షా మాటలను.. మోదీ రిపీట్ చేశారు.. అంతే!

Exit mobile version