Satyavathi Rathod criticized union minister Kishan Reddy: కేంద్రమంత్రి ఒక పార్లమెంట్ కే పరిమితమై పనిచేయడం సిగ్గు చేటని.. నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీకి తెలంగాణలో చోటు లేదని.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడో స్థానమే అని ఆమె అన్నారు. తెలంగాణలో బీహార్ కూలీలు 30 లక్షల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. బీహార్ సీఎం కేసీఆర్ ను పొగిడిన విషయం అందరూ చూశారని.. కిషన్ రెడ్డికి తెలుగు తప్ప, ఇతర భాషలు రావు, అర్థం కావని సెటైర్లు వేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డగా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: DGP Rajendranath Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన డీజీపీ..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన వాటాలు ప్రాజెక్టులకు జాతీయ హోదాను అడ్డుకుంటున్నా.. ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. మీరు తెలంగాణకు ఏం తెచ్చారో ముందు చెప్పి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఏపీ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్ ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్ భగీరథకు కేంద్ర సాయాన్ని కోరిన మొండి చేయి చూపించారని అన్నారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కట్టింది ఎంత.. మీరు తిరిగి ఇచ్చింది ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. మన ఊరు- మనబడికి కేంద్రం నిధులు ఇచ్చింది, దానికి కేసీఆర్ పేరు చెప్పుకుంటున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మన ఊరు మనబడి కాన్సెప్ట్ కేంద్రం ప్రవేశ పెడితే, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు…. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. కేసీఆర్ గారిని రాజకీయంగా బలహీనపరచాలని.. ఇబ్బంది పెట్టాలని చూస్తే కుదరదని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలకు పేదవాళ్ల అండ తప్పకుండా ఉంటుందని అన్నారు. రాజకీయంగా నాలుగు మాటలు మాట్లాడితే మాకు జరిగే నష్టం ఏం లేదని అన్నారు. బీజేపీ నాయకులు ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క కేంద్రమంత్రి వచ్చి వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన, అవసరం లేదని సత్యవతి రాథోడ్ అన్నారు.