Bus Accident : సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రమాదానికి అరగంట ముందే శివంపేట వద్ద ఇదే బస్సు ఒక స్కూటీని కూడా ఢీకొట్టిందని, అయినా డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Minister Ramprasad Reddy: జిల్లాల పునర్విభజనలో వదంతులను నమ్మొద్దు..
గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో క్షతగాత్రులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యవసరమైన సిటీ స్కాన్ (CT Scan) కోసం బాధితులు అరగంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి క్లిష్ట సమయంలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై బాధితుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు.
బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ప్రాణాపాయం తప్పి అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అటు పోలీసులు, ఇటు ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
New Year Celebration Ideas: ఈ న్యూ ఇయర్‌కి ప్లాన్స్ ఏం లేవా? ఇవి ట్రై చేయండి..
