Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు.. చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా… దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా… వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అయితే, జిల్లాల పునర్విభజన ప్రక్రియపై, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీడియాకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. పునర్విభజన అంశంలో జరుగుతున్న ప్రచారం తుది నిర్ణయాలు కాదని స్పష్టంచేశారు.
Read Also: Boxing Day tsunami: 23,000 అణుబాంబులు పేలితే ఎలా ఉంటుందో, అదే 2004 సునామీ..
జిల్లా ముక్కలు కాబోతోందంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు, అవగాహనలేని ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే కొనసాగుతుందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.. రాయచోటి ప్రజలు, నాయకులు ప్రభుత్వం పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, జిల్లా కేంద్రం విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించి, సమస్యకు పరిష్కారం చూపుతామని.. ప్రజల అభిప్రాయానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, పరిపాలన మరింత మెరుగుపడేలా మాత్రమే పునర్విభజన మార్పులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. వదంతులు వ్యాప్తి చేసే అసత్య ప్రచారాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ప్రకటించే వరకు అనధికారిక ప్రచారాలను విశ్వసించవద్దని సూచించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి..