ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తమ దారికి అడ్డువచ్చింది ఎవరైనా దాడులకు తెగబడుతూ బరితెగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులపై పెట్రోల్ పోసి దాడికి తెగబడ్డారు ఇసుక మాఫియా. తమకు అడ్డువచ్చారని అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులపై కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అటవీశాఖ జీప్‌పై పెట్రోల్ పోసి వాహనాన్ని తగలబెట్టి ప్రయత్నం చేశారు ఇసుకాసురులు. ఈ ఘటన కలకలం రేపింది.
Rahul Gandhi: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ టూర్.. ప్లానేంటి?
అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామంలో ఇసుక అక్రమంగా ట్రాక్టర్లు తో తరలిస్తున్నారని దమ్మపేట FRO వెంకటలక్ష్మికి సమాచారం అందడంతో తన సిబ్బందితో రాత్రి 10గంటల సమయంలో దాడి చేయడానికి వెళ్ళారు. అటవీ శాఖ అధికారులు రోడ్ పై వారి జీప్‌తో తిరుగుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఇసుక స్మగ్లర్లు అటవీ శాఖ అధికారులు దాడి చేయడానికి ఎంతమంది వచ్చారో తెలుసుకున్నారు, కేవలం డ్రైవర్ రాజేష్, FRO వెంకటలక్ష్మీ, బేస్ క్యాంప్ గార్డ్ జాన్ రెడ్డి మాత్రమే ఉన్నారని తెలుసుకున్నారు.
దీంతో ఓ 20 మంది ఇసుక స్మగ్లర్లు వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. అందరూ ఒక్కసారిగా రోడ్ పైకి వచ్చి అటవీ శాఖ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పుంటించే ప్రయత్నం చేశారు, అంతేకాకుండా అటవీ శాఖ అధికారులపై కర్రలతో దాడికి తెగబడ్డారు, కనీసం ఓ మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇసుక స్మగ్లర్లు తప్పతాగి విచక్షణ రహితంగా వ్యవహరించారు. అటవీశాఖ అధికారులు వీడియో తీసే ప్రయత్నం చేస్తుంటే అధికారులు చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ లు బలవంతంగా లాక్కున్నారు, ఇసుక స్మగ్లర్లు దాడిలో నుండి ఏదోవిధంగా బయట పడి ఫోన్ సిగ్నల్ రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఓ పది మంది పై ఫిర్యాదు చేశారు.