Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్

Saidabad Steel Bridge

Saidabad Steel Bridge

హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా సైదాబాద్ , పరిసర ప్రాంతాల ప్రజలకు జీహెచ్‌ఎంసీ తీపి కబురు అందించింది. గత ఆరేళ్లుగా వివిధ రకాల అడ్డంకులతో సాగుతూ వచ్చిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి జీహెచ్‌ఎంసీ ముహూర్తం ఖరారు చేయగా, రేపు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది అధికారికంగా ప్రారంభం కానుంది.

రూ.620 కోట్ల బడ్జెట్ , ప్రాజెక్టు వివరాలు

జీహెచ్‌ఎంసీ సుమారు రూ. 620 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. చంచల్‌గూడా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ నుండి ప్రారంభమయ్యే ఈ బ్రిడ్జి, సంతోష్ నగర్ పరిధిలోని యాదగిరి థియేటర్ వరకు మొత్తం 3.24 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. గతంలో అనేక సాంకేతిక, ఇతర కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైనప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో గడిచిన ఏడాది కాలంలో నిర్మాణ పనులు అత్యంత వేగవంతంగా సాగి పూర్తయ్యాయి.

ట్రాఫిక్ కష్టాలకు చెక్ , ర్యాంప్‌ల నిర్మాణం

ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా చంచల్‌గూడా, సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్ మార్గాల్లో సుదీర్ఘకాలంగా వేధిస్తున్న తీవ్ర ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు గాను చంచల్‌గూడా వైపు నుండి వచ్చి చంపాపేట్ వైపు వెళ్లే వాహనదారుల కోసం ఐఎస్ సదన్ వద్ద ప్రత్యేకంగా డౌన్ ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఐఎస్ సదన్ వైపు నుండి నల్గొండ ఎక్స్ రోడ్డు దిశగా వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా అప్ ర్యాంప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో హైదరాబాద్ పాతబస్తీ , దక్షిణ నగర ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.