Telangana Educational Minister Sabitha Review Meeting on Independence Day.
స్వేచ్చా భారతావని కోసం అశువులుబాసిన ఎంతో మంది త్యాగధనుల చరిత్రను గుర్తు చేస్తూనే నేటి తరం యువతలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న పోరాటయోధులను స్మరిస్తూనే వారి త్యాగాలను నేటి యువతకు తెలిసేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమం సందర్బంగా గురువారం నాడు తన కార్యాలయం నుంచి జిల్లా విద్యా శాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 15 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొనేలా చూడాలని అధికారులను కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ’ కార్యక్రమం సందర్బంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి విద్యా శాఖ తరుపున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆగస్టు 8 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.
పాఠశాల విద్యార్థులు మొదలు కొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి తెలిసేలా వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, జాతీయ భావాలను రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పీజీ, విశ్వవిద్యాలయాలు సహా గురుకులాల్లో మొత్తం 15రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గాంధీ సినిమా ను చూసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఈ సందర్బంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఆగస్టు 10 తేదీన వజ్రోత్సవ వన మహోత్సవాన్ని నిర్వహించి ప్రతీ విద్యా సంస్థలో కనీసం 75 మొక్కలను నాటాలని కోరారు. జిల్లా విద్యా శాఖాధికారులు, జిల్లా ఇంటర్మీడియేట్ అధికారులు, యూనివర్సిటిల వైస్ ఛాన్సలర్లు ప్రణాళిక బద్దంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.