NTV Telugu Site icon

Revanth Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పేరుతో దోచుకుంటున్నారు

Revanth Reddy Pressmeet

Revanth Reddy Pressmeet

Revanth Reddy Gives Clarity On His Comments Over Free Power For Farmers: అమెరికాలో తానా సభల్లో ఉచిత విద్యుత్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ అతితెలివితో తన మాటలను ఎడిట్ చేశారని, కేవలం తమకు కావాల్సిన బిట్ మాత్రమే కట్ చేసి ట్రోల్ చేయించారని ఫైర్ అయ్యారు. తాను ఉచిత విద్యుత్‌కి వ్యతిరేకంగా మాట్లాడానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. తానూ రైతు కుటుంబం నుంచి వచ్చినవాడినేనని.. అన్నదాత‌ల క‌ష్టాలు, నష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు. తాను కేటీఆర్‌లాగా అమెరికాలో బాత్రూంలో కడగలేదని, దమ్ముంటే తనతో కలిసి కేటీఆర్ దుక్కి దున్నాలని సవాల్ విసిరారు.

Sandra Venkata Veeraiah: రేవంత్ ప్రకటనతో.. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ బూటకమని తేలింది

రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెప్తోందని.. వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూములున్న ప్రాంతాల్లో మాత్రం 10 నుంచి 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు.. రూ.16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ ఆ బడ్జెట్ కింద కేటాయించిన నిధుల్లో నుంచి సగం డబ్బు.. అంటే ఏడాదికి రూ.8 వేల కోట్లు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.

Shah Rukh Khan: విజయ్ ఒక పిచ్చి నటుడు.. షారుఖ్ సంచలన వ్యాఖ్యలు

2004లో 7 గంటల ఉచిత విద్యుత్ ఫైల్‌పై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారని, ఆ తర్వాత 2009లో 7 గంటల ఉచిత విద్యుత్‌ను 9 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేవలం ఉచిత విద్యుతే కాదు.. రైతులకు సబ్సిడీ మీద ఎరువులు, ఇతర పనిముట్లు కూడా అందజేశామని అన్నారు. రైతులకు రుణ విముక్తి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎలాంటి చ‌ర్చకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్.. వంద‌ల కోట్లు అప్పులు తీసుకొచ్చిందని, దీనివ‌ల్ల ప్రజలపై అద‌న‌పు భారం పడిందని పేర్కొన్నారు. తమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. రైతులకు ఉచిత విద్యుత్ తప్పకుండా ఇస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ప్రకటించారు.

MP Margani Bharat: ఒకరు ఉంటే భార్య.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటారు..!

అనాటి బషీర్ బాగ్ కాల్పులకు సీఎం కేసీఆరే కారణమని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బషీర్ బాగ్‌లో రైతులను కాల్చి చంపిందే కేసీఆర్ అని, ఈ ఘటనలో కేసీఆర్ టీడీపీలో భాగస్వామిగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రజలకు నష్టాలను, కష్టాలను కలిగించే కేసీఆర్‌ను చెత్త బుట్టలో పడేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరు మీద కూడా దోపిడి చేశారని ఆరోపణలు గుప్పించారు. దళితబంధుపై కమిషన్ తీసుకున్నారని, అన్ని పథకాలతో ప్రజలను దోపిడి చేసిన కేసీఆర్‌ను రాష్ట్రంలో రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.