Revanth Reddy Gives Clarity On Alliance With TRS Party: కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలుసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై స్పందించారు. టీఆర్ఎస్‌తో పొత్తు కలలో కూడా జరగదని తేల్చి చెప్పారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై.. ఈ ఇంటి కాకి ఆ ఇంటిపై వాలదని అన్నారు. ఒకవేళ వాలితే చంపేస్తామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని వరంగల్ సభలోనే రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాపాలను, తప్పులను మోసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నారు. పొలిటికల్ సీన్‌లో కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ బీజేపీని ఎంకరేజ్ చేశారని, ఇప్పుడు అదే బీజేపీ కేసీఆర్ పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు.
ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. కర్ణాటక, రాయచూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ మూడో వారంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని రేవంత్ తెలిపారు. దేశంలో ఎవ్వరు ఆహ్వానించనట్టుగా.. రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ స్వాగతం పలుకుతుందని అన్నారు. తెలంగాణలో బీజేపీలో గెలిచేంత మొనగాళ్లు ఎవరున్నారని ప్రశ్నించిన ఆయన.. ఆ పార్టీలో పట్టుమని పది మంది కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో ఇటు తెలంగాణలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ఈ పాదయాత్రం ఎంటర్ అవుతుంది.