ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు రాహుల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సింగిల్ విండో చైర్మన్‌గా ఓడిపోయినా… కేసీఆర్‌కి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని, కేసీఆర్.. మొదట ఎమ్మెల్యేగా ఓడిపోలేదా..? అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా కేసీఆర్ రాజకీయ ప్రస్థానమే ఓటమితో మొదలైందని, సిద్దిపేట ఎమ్మెల్యే నుండి.. కరీంనగర్ ఎంపీగా పోయాడు.. అటు నుండి పాలమూరు పారిపోయిరాలేదా.. మెదక్ నుండి గజ్వేల్ పారిపోలేదా కేసీఆర్ అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. పారిపోవడంలో పట్టా ఇవ్వాల్సి వస్తే కేసీఆర్‌కే ఇవ్వాలంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ మాటలు గురివింద సామెత లెక్క ఉన్నాయని, గాంధీ కుటుంబంతో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు టీఆర్‌ఎస్ వాళ్ళు అని, దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళిన కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు.