Site icon NTV Telugu

CM Revanth Reddy : ఉద్యోగులే ప్రభుత్వ సారథులు.. డీఏ జీవోపై సంతకం చేశా.. త్వరలోనే జిల్లాల పునర్విభజన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రగతి చక్రం పదిన్నర లక్షల మంది ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే అసలైన సారథులు ఉద్యోగులేనని స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు మారినంత మాత్రాన వ్యవస్థ మారదని, గత ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఉద్యోగుల చేత తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని ఆయన ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం చేసే మంచి పనులను ఉద్యోగులు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అభినందించారు.

ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ (DA) అంశంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. “మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను. ఈరోజో, రేపో దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుంది” అని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ప్రతి ఉద్యోగికి రూ. కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవీ విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

Nandini Sharma Hat-Trick: గుజరాత్ జెయింట్స్‌పై హ్యాట్రిక్.. ఎవరీ నందిని శర్మ!

ప్రతిపక్ష నేత కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెద్దదిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. “శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉంటే, ఆయన పంపిన మారీచులు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ పనులను అడ్డుకుంటున్నారు” అని ధ్వజమెత్తారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సమయం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని జిల్లాల విభజనలో ఉన్న అశాస్త్రీయతను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సీఎం వెల్లడించారు. జిల్లాల పునర్విభజన , రేషనలైజేషన్ కోసం ఒక ప్రత్యేక కమిటీని వేయబోతున్నట్లు ప్రకటించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై సమగ్రంగా చర్చిస్తామని, ముందుగా మండలాల రేషనలైజేషన్ చేపడతామని తెలిపారు. గతంలో మల్కాజిగిరి జెడ్పీ సమావేశంలో తాను చూసిన విచిత్ర పరిస్థితులను గుర్తు చేస్తూ, సరిహద్దుల విషయంలో ఉన్న అపోహలను తొలగిస్తామన్నారు. రాచకొండకు ఉన్న ‘దొరల కొండ’ అనే పేరు మార్చి ప్రజల పేరు పెట్టానని, పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాల చిరకాల వాంఛ అయిన అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. “భవన నిర్మాణం కోసం అసోసియేషన్ ఎంత నిధులు సమకూర్చుకుంటే, ప్రభుత్వం కూడా అంత మొత్తాన్ని గ్రాంట్‌గా ఇస్తుంది” అని వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించడానికి త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

TheRajaSaab : రాజాసాబ్ 1st వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ ‘స్టార్ పవర్’

Exit mobile version