CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు

  • చదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి వద్ద ఘటన
  • సీఎం కాన్వాయ్‌కు ఎదురుగా వచ్చిన ఎద్దు
  • వెంటనే బ్రేకులు వేసిన కాన్వాయ్ సిబ్బంది
  • ఎద్దును పక్కకు తప్పించిన ట్రాఫిక్ పోలీసులు
Cm Convoy

Cm Convoy

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ రేస్ కోర్స్‌లో జరిగే చీఫ్ మినిస్టర్ ట్రోఫీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్ చదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఓ ఎద్దు ఎదురుగా అడ్డుపడింది.

కాన్వాయ్ సిబ్బంది అప్రమత్తత.. బ్రేకులతో ముందుకు

ఎదురుగా ఎద్దు రావడాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల్లో బ్రేకులు వేసి వాహనాలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకుని కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ ఘటనతో అక్కడున్న మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంటనే స్పందించారు. కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లిన ఎద్దును అప్రమత్తంగా పక్కకు లాగి పక్కకు తప్పించారు. సిబ్బంది, ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం కాన్వాయ్ ముందుకు కదిలింది.