తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పట్టణంలో మురళీధర్ రావు ఫ్లెక్సీ పెట్టారు.. కానీ స్టాంప్ సైజులోనైనా సంజయ్ బొమ్మ కూడా పెట్టలేదు.. విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు.. లు నిన్ను ఎంత చిన్నచూపు చూస్తున్నారో బండి సంజయ్ నీకు అర్థమైందా..? నీతలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బండి సంజయ్..? అంటూ ప్రశ్నించారు.
అంతేకాకుండా సొంత పార్టీ నేతలు తప్పు చేస్తే ప్రశ్నించలేని వ్యక్తి ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తాడా..? అలాంటిది బండి సంజయ్ నీకెందుకు అధ్యక్ష పదవి.. రాజీనామా చెయ్యి.. లేదా..మురళీధర్ రావు పై చర్యలు తీసుకో.. అంటూ డిమాండ్ చేశారు. మురళీధర్ రావు కు కెసిఆర్ అండ ఉందని భయపడకు అంటూ ఎద్దేవా చేశారు. ఈటల మద్దతుగా బీజేపీ నేతలు ఎందుకు ప్రచారం చేయడం లేదో చెప్పాలన్నారు.