ఈరోజు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలో ఆంక్షలు విధించారు. లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. లిబర్టీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు పూర్తయ్యే వరకు పబ్లిక్ వాహనాలను అటువైపు అనుమతించడం లేదని పోలీసులు తెలియజేశారు. ఇక అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చే నేతల వాహనాల పార్కింగ్ ల కోసం బుద్దభవన్, నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో వాహనాలు పార్క్ చేసేందుకు వీలు కల్పించారు. ఇక అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి లిబర్టీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు, అలానే లిబర్టీ కూడలి నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను బషీర్ బాగ్ వైపు, బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.