హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు అర్హమ్ ఖాన్, మహేందర్‌రెడ్డి, శంకర్ గౌడ్, ఏవీ రత్నం, షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్, రాజలింగం, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు.
Read Also: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
అంతకుముందు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు విజేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు విస్తృత ప్రయోగాలు చేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన భారత్ బయోటెక్ సంస్థ కృషిని అభినందిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎల్లా కృష్ణ, సుచిత ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం హర్షణీయమన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో తెలుగు వారి ఖ్యాతిని దాటించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలాలను పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం సముచితమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
