హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాయలసీమ ముఠా హల్‌చల్ చేసింది. ఖరీదైన స్టలం ఆక్రమణకు ప్రయత్నించింది ముఠా. కర్నూల్ జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడిని నాయకత్వంలోని ముఠా ఈ అరాచకానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆదోనికి చెందిన 90మంది రౌడీలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 100 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమించేందుకు ముఠా ప్రయత్నించింది. వంద కోట్ల స్థలం ఆక్రమించేందుకు భూ మాఫియా పడగ విప్పింది. ఫ్యాక్షన్ సినిమా తలపించేలా కిరాయి రౌడీలు మారణాయుధాలతో నగరానికి వచ్చారు. స్థలం ఆదీనంలోకి తెచ్చేందుకు విధ్వంసం సృష్టించారు. కాపలాదారులపై దాడి చేశారు. బుల్డోజర్లు, టస్కర్లు తీసుకువచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. అంతే కాదు కంటైనర్లను స్థలంలోకి దించారు. ఇదంతా కేవలం గంటలోపే జరిగిపోయింది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు సిబ్బందితో స్థలం వద్దకు వెళ్లే సరికి కొంత మంది పారిపోగా 62 మంది కిరాయి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్ పెట్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 403లో 2.5 ఎకరాల ప్రభత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2005లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ జెమ్స్ అండ్ జువెలరీస్ కు కేటాయించింది. ఏపీ జెమ్స్ నిర్వాహకులు సుమారు ఎకరన్నర స్థలంలో నిర్మాణాలు చేశారు. మిగతా స్థలం ఖాళీగానే ఉంచారు. సంస్థ కార్యకలాపాల కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో 10 మంది కాపలాదారులను నియమించింది. ఇదిలా ఉండగా ఖాళీ స్థలం తమదేనంటూ కొంత మంది డాక్యు మెంట్లు సృష్టించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, సాధ్యం కాలేదు. బంజారాహిల్స్ పీఎస్‌లో కూడా స్థల వివాదంపై కేసులు నమోదు అయ్యాయి. పక్కా స్కెచ్ వేసి.. ఖాళీగా ఉన్న స్థలంపై అనేక మంది కన్ను పడింది. పాతబస్తీకి చెందిన వీవీఆర్ శర్మ అనే వ్యక్తి స్థలం తనదేనంటూ కోర్టులో కేసు కూడా వేశాడు.
మరోవైపు, శర్మ స్థల అభివృద్ధి కోసం రెండు సంవత్సరాల క్రితం ఏపీకి చెందిన మాజీ ఎంపీ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌కు చెందిన కంపెనీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశ్వ ప్రసాద్ కంపెనీ ప్రతినిధులు పలు మార్లు స్థలంలోకి వెళ్లి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నించగా ఏపీజెమ్స్ సెక్యూరిటీ అడ్డుకుంటూ వచ్చింది. ఇదిలా ఉండగా వంద కోట్ల స్థలం ఎలాగైన హస్తగతం చేసుకోవాలని విశ్వప్రసాద్ ప్రయత్నాలు ఆరంభించాడు. దీనికి కర్నూల్ జిల్లా అధోనికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులను తన గ్రూపులో చేర్చుకున్నాడు. రాత్రి రాత్రే స్థలాన్ని ఆక్రమించాలని, చూసే వారికి స్థలం తమ ఆధీనంలోనే ఉన్నట్టు కనిపించే విధంగా పథకం సిద్ధం చేశాడు. రాయలసీమ బ్యాచ్‌ను దించాడు.. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశరాఉ.. ఇక, అరెస్ట్ అయిన నిందితులను రెండు డీసీఎంలలో ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేయించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర వంద మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.