TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి

  • ఎకరాకు రూ.269 కోట్ల రికార్డు ధర
  • 5.38 ఎకరాల ప్లాట్‌కు రూ.1,447 కోట్లు
  • వారం రోజుల్లోనే రూ.2,833 కోట్ల ఆదాయం
  • ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌పై భారీ నమ్మకం
Tgiic

Tgiic

TGIIC : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ రాయదుర్గంలో నిర్వహించిన భూముల ఈ-వేలానికి పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో ప్రతిపాదిత రిజర్వ్ ధర కంటే ఏకంగా 52.3 శాతం అధిక ధరకు భూములు విక్రయమయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం , వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు.

వారంలోనే వేలంలో సరికొత్త రికార్డులు

తాజాగా నిర్వహించిన 5.38 ఎకరాల ‘ప్లాట్‌-P2’ వేలంలో ఎకరాకు ఏకంగా రూ.269 కోట్ల ధర పలకడంతో మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు గత వారం జరిగిన ‘ప్లాట్‌-P1’ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు వచ్చాయి. మొదటి ప్లాట్‌కు సంబంధించిన 25 శాతం తొలి విడత నిధులు కూడా ఇప్పటికే టీజీఐఐసీ ఖాతాకు చేరాయి. ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్లాట్లకు (మొత్తం 10.63 ఎకరాలు) సంబంధించి రూ.2,833.22 కోట్ల భారీ రాబడి లభించింది. ఈ వేలంలో సగటున ఎకరా ధర రూ.266.53 కోట్లుగా నమోదవడం విశేషం.

ప్రభుత్వ విధానాలకు దక్కిన నమ్మకం

ఎమ్‌ఎస్‌టీసీ ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన ఈ ప్రక్రియకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ ‘జేఎల్‌ఎల్’ వ్యవహరించింది. ఈ సక్సెస్ పై టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఈ రికార్డు ధరలే నిదర్శనమన్నారు. పారదర్శక విధానాల ద్వారా ప్రభుత్వ ఆస్తులకు గరిష్ట విలువను సమకూర్చడంలో రాయదుర్గం వేలం ఒక మైలురాయిగా నిలిచిందని స్పష్టం చేశారు.