Site icon NTV Telugu

Telangana : ఈ-కేవైసీ లేకపోతే రేషన్‌ కట్.!

Newrationcards

Newrationcards

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్‌ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు ఇచ్చినా, ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తిచేయకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్‌ సరఫరా నిలిపివేస్తామని మరోసారి హెచ్చరించారు.

రేషన్‌ కార్డులో నమోదైన సభ్యులందరూ సమీపంలోని రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తయ్యిన వారికే రేషన్‌ సరఫరా జరుగుతుందని, లేకపోతే కోటా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది.

గత రెండేళ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ జరగలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 31లోపు మిగిలినవారంతా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్‌ కోటా ఉండదని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రేషన్‌ డీలర్లు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరి బయోమెట్రిక్‌ వేలిముద్రలు ఈ-పాస్‌ యంత్రంలో నమోదు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా నమోదు కాకపోతే తమ తప్పుగా ఎలా పరిగణిస్తారని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ గడువును డిసెంబర్‌ 31 తర్వాత కూడా పొడిగించాలని పలువురు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఇటీవల మంజూరైన కొత్త రేషన్‌ కార్డుదారులకు ఇప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పాత రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం, వంటగ్యాస్‌, గృహజ్యోతి, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు అందుతున్నప్పటికీ, కొత్త కార్డులు పొందిన వారికి అవి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్‌ కార్డుదారులకు కూడా సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Shocking Incident: రాజస్థాన్ లో దారుణం.. ప్రయాణికుడిపై కండక్టర్ దాడి..

Exit mobile version