తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి తెరదించాలన్న ఉద్దేశంతో గెజిట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఆ గెజిట్లపై తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో.. జలసౌధలో ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్… కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం కొనసాగుతోందని వెల్లడించిన ఆయన.. పాలనాపరమైన, సాంకేతికపరమైన, న్యాయపరమైన అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా తేల్చాలని కోరిన రజత్ కుమార్… తెలంగాణ వాటా తేల్చే వరకు ఈ ఏడాది 811 టీఎంసీల్లో సగం కేటాయించాలన్నారు.. ఇక, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని స్పష్టం చేశారు.