Pralhad Joshi Warns CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారతదేశం, తెలంగాణ రాష్ట్రం కన్నా.. కేసీఆర్‌కు తన కుటుంబమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. బియ్యం రీ-సైక్లింగ్‌లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని అభియోయాలున్నాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్‌కి హాజరు కాలేదని.. డబుల్ బెడ్రూం హామీల్ని నెరవేర్చకపోవడంతో పాటు అవాస్ యోజన ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. అటు.. ఎంఐఎంతో కలిసి పాతబస్తీలో మెట్రో రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. తన కుటుంబంలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారే తప్ప, నిరుద్యోగ యువతని గాలికొదిలేశారన్నారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ – బీజాపూర్ హైవేకి కేంద్రం 2017లోనే 924 కోట్లు కేటాయించిందని.. అయితే భూ సేకరణ చేయకపోవడం వల్ల పనులు జరగడం లేదని అన్నారు.
రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం కూడా కేంద్రం 2019-20లో 2057 కోట్లు, 2020-21లో 2602 కోట్లు, 2021-22లో 2420 కోట్లు, 2022-23లో 3500 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూ సేకరణకు ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. సొంత సంపాదనపై ఉన్న శ్రద్ధ.. ప్రాజెక్ట్‌ల మీద ఏమాత్రం లేదని ఆగ్రహించారు. సంబంధిత సంస్థల ఆమోదం లేకుండా నిధులు ఖర్చు చేశారని.. ఈ విషయంపై కాగ్ సీరియస్ ఆరోపణలు కూడా చేసిందని అన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలు అమలు చేయకపోతే, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే.. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని ప్రహ్లాద్ జోషి హెచ్చరించారు.