Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని సాధించేందుకు తీసుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం రాజ్యాంగబద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే ఈ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. “బీసీల రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించవు. ఇది బలహీన వర్గాలకు చేయూతగా ఉండే నిర్ణయం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం ఈ చర్యను ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు.
కొంతమంది వ్యక్తిగత స్థాయిలో “రెడ్డి జాగృతి” పేరుతో చేసే చర్యలు మొత్తం వర్గానికి సంబంధించినవిగా పరిగణించకూడదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం రాకుండా, పెద్దలు బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. “రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న హక్కుల మాదిరిగా బీసీలకూ హక్కులు ఉండాలన్నదే మా ప్రయత్నం. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బిల్లు ముందుకు వెళ్లింది.
రాజకీయ పార్టీల మద్దతే ప్రజల మద్దతు” అని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ, ఏఐసీసీ ఇన్‌చార్జ్ సూచనల మేరకు తాను, డిప్యూటీ సీఎం వాకాటి శ్రీహరి ఢిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాదులను కలవనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటక సీఎం మారుతారా..? బీజేపీ నేత వాదనలో నిజమెంత..?
