Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్‌నా? పొంగులేటి ఫైర్

  • రాజీనామా డిమాండ్‌పై పొంగులేటి ఘాటు కౌంటర్
  • కేసీఆర్‌ రాజీనామా చేయాలా అంటూ హరీశ్‌రావుకు ప్రశ్న
  • అధికారంలో అవినీతి.. ప్రతిపక్షంలో బ్లాక్‌మెయిల్ అంటూ ఫైర్
  • ‘పొంగులేటి.. పొంగు’ వ్యాఖ్యలపై మంత్రి వార్నింగ్
Ponguleti

Ponguleti

తెలంగాణలో 22ఏ భూముల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజీనామా చేయాలని తనను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనను రాజీనామా చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కేసీఆర్‌ రాజీనామా చేయాలా? అని హరీశ్‌రావును నిలదీశారు.

తాను ప్రతి నెల కేవలం రూపాయి జీతం తీసుకుంటూ పేదల కోసం పనిచేస్తున్నానని పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంతో పాటు ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అసత్య ప్రచారాలతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వారి బెదిరింపులకు భయపడే ప్రభుత్వం ఇది కాదని స్పష్టం చేశారు.

తన పేరును ప్రస్తావిస్తూ ‘పొంగులేటి.. పొంగు’ అంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైనా మంత్రి ఘాటుగా స్పందించారు. ‘పొంగులేటి.. పొంగు’ అని ఎందుకు పదేపదే అంటున్నారని ప్రశ్నించారు. శుభకార్యంలో పాలు పొంగితే శుభమని, గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపంలో పొంగితే ఆ ప్రవాహంలో మీరే కాదు.. మీ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.