మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు. “శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు” అంటూ తాను పారదర్శకంగా వ్యవహరిస్తానని తెలిపారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని, రూ.211 కోట్ల నిధులు ఇప్పటికే కేటాయించామని వెల్లడించారు మంత్రి పొంగులేటి. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
తనపై సహచర మంత్రులు ఫిర్యాదులు చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. “నామీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏముంది? ఎవరైనా చేస్తే అది నిజం కాదని నమ్ముతున్నా” అని పేర్కొన్నారు. సీతక్క, సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్కలాగా పనిచేస్తున్నారు. జాతర కోసం మేము అందరం కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. రాతి కట్టడాలకు అవసరమైన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామని, 90 రోజుల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. అన్ని పనులు శాశ్వత ప్రతిపాదకన చేపడుతున్నామని, ఆది వాసీల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు.
