హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు.
ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది.
రాష్ట్రంలో దసరా సంబరాలు ముగిశాయి. కానీ హుజూరాబాద్‌లో ఇంకా ముగిసినట్టు లేదు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం దసరాలాగే ఉంది. మరో పది రోజులు ఈ ఉప ఎన్నిక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన హుజూరాబాద్‌లో ఎక్కడ చూసినా ధన ప్రవాహమే అన్నట్టుంది పరిస్థితి. తనిఖీలలో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. ఇప్పటి వరకు కోటీ 57 లక్షల రూపాయలు సీజ్ అయ్యాయి. డబ్బు మాత్రమే కాదు మద్యం, గంజాయి, బంగారం కూడా బయటపడుతోంది పోలీసు తనిఖీలలో. చివరకు పేలుడు పదార్థాలు కూడా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. వీటికి సంబంధించి గత ఇరవై రోజులలో 39 కేసులు నమోదయ్యాయి.
నిజానికి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి హుజూరాబాద్‌లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. షెడ్యూల్ రాక ముందే ఈటల పాదయాత్రకు దిగారు. తరువాత అనారోగ్యంతో ఆపేశారు. ప్రచారంలో ఇప్పటికే ఊళ్లన్నీ చుట్టేశారు. కుల సంఘాల నేతలను కలిశారు. జనంతో మమేమవుతూ వచ్చారు. ఇప్పటి వరకు ఈటల రాజెందర్ అన్నీ తానై ప్రచారం చేసుకున్నారు.
ఇప్పుడు బీజేపీ క్యాడర్ మొత్తం హుజురాబాద్‌లో వాలిపోతోంది. ఈ ఎన్నికల్లో గెలుపుకు పక్కా ప్రణాళిక రెడీ చేసింది. ప్రచారం చివరకు వరకు ప్రతి మండలంలో రోజుకో ముఖ్యనేత ప్రచారంలో ఉంటారు. అంటే ఐదు మండలాలలో ఐదుగురు ప్రముఖ నాయకులు రోజూ ప్రచారంలో ఉండేలా ప్లాన్ చేశారు.
ఈ నెల 27తో ప్రచారం ముగుస్తుంది. ప్రచార పర్వానికి ఫినిషింగ్ టచ్‌గా కేసీఆర్‌తో భారీ బహిరంగ సభకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది హుస్నాబాద్ లో ఉంటుందా… లేదంటే ముల్కనూర్‌లోనా అన్నది తెలియాల్సి వుంది. దీనికి ధీటుగా బీజేపీ కూడా భారీ సభ నిర్వహించే ఏర్పాట్లలో ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు.
హోం మంత్రి అమిత్ షా, లేదంటే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఇద్దరిలో ఎవరో బహిరంగ సభకు హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ప్రచారంలోకి దూకనున్నారు.
తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, విజయశాంతి, డీకే అరుణ, మురళీధర్ రావు, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, వివేక్, లక్ష్మణ్ వంటి వాయిస్ పవరున్న నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మురళీధర్ రావు ఇప్పటికే హుజూరాబాద్‌లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మరో వైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలతో జనం దృష్టిని తమ వైపు తిప్పుకుంటోంది. దళితబంధును టీఆర్‌ఎస్ తురుపు ముక్కగా ఈటలపై ప్రయోగిస్తోంది. మంత్రి తన్నీరు హరీశ్‌రావు అక్కడే క్యాంపేసి రాజకీయం నడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీనియర్లను రంగంలోకి దింపి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదిలావుంటే, ఆర్థిక మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆస్తులు కాపాడుకునేందుకే ఈటల బీజేపీ లో చేరారని ఆరోపించారు. అంతే కాదు ఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ఏడేళ్ల పాలనకు..రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ఏడేళ్ల పాలనకు రెఫరెండంగా తీసుకుందామా ..అందుకు సిద్ధమేనా అంటూ ఈటలకు సవాలు విసిరారు. దీనిపై ఈటల స్పందించలేదు. అలాగే తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, గెలిస్తే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఉంటాడా అని ఈటల చాలెంజ్ చేశారు. దీనిపై హరీష్ రావు నుంచి స్పందన లేదు.
ఐతే, హరీష్ రావు రిఫరెండమ్ అనటాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ ఇలాగే సవాలు చేసింది. అప్పుడు టీఆర్‌ఎస్ దానిమీద పెద్దగా రియాక్ట్ అవలేదు. నిజానికి హరీష్ సవాలులో న్యాయం లేదంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు జరుగుతున్నది అసెంబ్లీ ఎన్నికలే కాని లోక్‌సభ ఎన్నికలు కాదు. అసెంబ్లీ ఎన్నిక మోడీ పాలనకు ఎలా రెఫరెండం అవుతుంది అన్నది వారి ప్రశ్న. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ పాలనపై మాత్రమే ప్రజా తీర్పు అవుతుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు!!