Peddi Sudarshan Reddy Challenges YS Sharmila: కోర్టు ఉత్తర్వుల మేరకు షర్మిల పాదయాత్రం చేస్తే, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అయితే.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం.. టీఆర్ఎస్ శ్రేణులు కచ్ఛితంగా ఆమెను అడ్డుకుంటారని తేల్చి చెప్పారు. షర్మిల ఆరోపణలు చేసినట్టు.. తన వద్ద అక్రమాస్తులు ఏవీ లేవని స్పష్టం చేశారు. ఒకవేళ విచారణలో తన వద్ద అక్రమాస్తులు ఉన్నాయని తేలితే.. తాను ఏం కావాలంటే, అది ఇచ్చేస్తానని చెప్పారు. మరి, తెల్లకాగితంపై సంతకం చేసే దమ్ము షర్మిలకు ఉందా? అని సవాల్ విసిరారు. అసలు తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణకు నష్టం కలిగించిన వైఎస్ఆర్ కూతురిగా ఆమె నిలిచిపోతుందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలపై ఆమె తన వ్యవహార శైలి మార్చుకోకపోతే.. పక్క రాష్ట్రంలో జగన్ పాలన విషయంపై నిలదీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే.. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు కూడా వెనుకాడమని తేల్చి చెప్పారు.
అంతకుముందు.. షర్మిల పాదయాత్ర వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజా సమస్యలు లేవా? అని నిలదీశారు. తెలంగాణకు వచ్చి ఎందుకు పర్యటన చేస్తున్నారని షర్మిలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలపై షర్మిల ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తే.. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడే ప్రజాగ్రహాన్ని షర్మిల చవిచూడాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి జగన్ రాసిన లేఖ వల్లే నర్సంపేట ప్రజల 70 ఏళ్ల కల ఆవిరైందని, గోదావరి జలాలు రాకుండా ఆపారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేయడం షర్మిల మానుకోవాలని హితవు పలికారు. ఇటీవల జరిగిన ఘటనలో షర్మిలకి గాయమైనట్టు టీవీలో చూపారని, ఆ మరుసటి రోజే అది ఎలా మాయమైందని ప్రశ్నించారు. తెలంగాణని ఆఫ్గనిస్తాన్‌తో, సీఎంని తాలిబన్‌గా షర్మిల పోల్చారని.. ఒక రాష్ట్ర గవర్నర్‌గా మీరు సమర్థిస్తారా? అంటూ గవర్నర్ తమిళిసైని అడిగారు.