తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. ఆయన కూడా రెడీగా ఉన్నట్టు వారి మాటల్లో అర్థం అవుతోంది.. కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో చేరడం ఖాయం అనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికే ఉత్సాహంగా ఉన్నారని అర్థం అవుతోంది.. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాజకీయ పరమైన అంశాల కంటే.. అభివృద్ధి అంశాల మీదనే చర్చించామని.. నిరుద్యోగం, కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలు చర్చకు వచ్చాయని తెలిపారు.. తెలంగాణను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయిన ఆయన.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను.. అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా.. ఐడియాలజీకి చేయలేదని.. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చు అని ఆహ్వానించారు రేవంత్.
ఇక, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాలనేది త్వరలోనే చెబుతా అన్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి… పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని నేను స్వయంగా వెళ్లి కలుద్దాం అనుకున్నా.. కానీ, ఆయనే వస్తానని వచ్చారని.. మేం ఇద్దరం.. రాష్ట్ర పరిణామాలపై చర్చించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని వెల్లడించిన మాజీ ఎంపీ.. తెలంగాణ ఆకాంక్షలతో ఎవరు ఏ పోరాటం చేసినా.. నేను మద్దతిస్తా.. కాంగ్రెస్ పార్టీ చేస్తే మరింత సంతోషిస్తా అన్నారు.. ఈ స్టేట్‌మెంట్‌తో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎంపీగా విజయం సాధించిన విశ్వేశ్వర్‌రెడ్డి.. కొంతకాలం చురుకుగా పనిచేసినా.. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేసి సైలెంట్‌గా ఉంటున్నారు.. ఇదే సమయంలో.. పలువురు నేతలతో ఆయన సమావేశం కావడం.. ఇతర చర్చలకు కూడా దారితీసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. రేవంత్‌కు పీసీసీ ఇస్తే.. ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం కూడా సాగింది. మొత్తంగా మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది.