తెలంగాణలో వివిధ సమస్యలపై ట్వీట్లు చేస్తుంటారు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇటీవల ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంపై తనదైన రీతిలో స్పందించారు రేవంత్. రాహుల్ గాంధీని విమర్శిస్తూ టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. తాజాగా తెలంగాణలో ఆరోగ్యరంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను ప్రస్తావించారు.
ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సలో వున్న రోగిని ఎలుకలు గాయపరిచిన ఘటన సంచలనం కలిగించింది. ఐసీయూలో భీమారంకు చెందిన రోగి శ్రీనివాస్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. దీనిపై రేవంత్ స్పందించారు. విమర్శలు చేశారు.
ఆసుపత్రిలో శానిటేషన్ పనులు సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్పత్రిలో డ్రైనేజీ, పారిశుధ్య పనులను మెరుగుపర్చాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. మౌలిక వసతులు మెరుగుపరచకుండా సెల్ప్ డబ్బా కొట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.