వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.. వరి కొనుగోళ్లపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. తాజా పరిస్థితిపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు డెడ్‌లైన్ పెట్టారు.. ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుతం ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Read Also: Omicron Xe: ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్.. ఊరటనిచ్చే న్యూస్..!
ఇక, 24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి.. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని.. రైతులకు భరోసా కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలన్న ఆయన… రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టీఆర్ఎస్‌లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలని.. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి.. వారికి అండగా ఉంటుందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
