తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు రోజురోజుకు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. కరీంనగర్‌లోని సందర్శకులను ఆకర్షించే మానేర్ డ్యామ్‌ను విహంగ వీక్షణం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా ఎయిర్ షో నిర్వహించి.. ప్యారాచూట్ విన్యాసాలకు ఈ ప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్ ఇప్పటికే దీనికి సమ్మతి తెలిపారు.
ఈ నేపథ్యంలో.. మానేరు అందాలతో పాటు కేబుల్ బ్రిడ్జ్, కరీంనగర్ టౌన్‌ని ఆకాశం నుంచి చూసే విధంగా ఎయిర్ షోలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి అవకాశం ఇప్పటి వరకు ముంబై, వైజాగ్, గోవా లాంటి పర్యాటక ప్రదేశాల్లో మాత్రమే కనిపించేది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో చర్చించి కావాల్సిన అనుమతులు కోరినట్లు తెలిసింది.