Site icon NTV Telugu

ED Notices: రేపు విచారణకు రావాలి.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

Mlc Kavitha Ed Notic

Mlc Kavitha Ed Notic

Once again ED notices for MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత మరోసారి కవితను విచారణకు పిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాను కవిత బినామీనని అరుణపిళ్లై గతంలో ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిళ్లై అప్రూవర్లుగా మారారు. దీంతో కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారనుంది. కవిత ఇప్పటికే ఒకసారి ఈడీ విచారణకు వెళ్లింది. ఈ ఏడాది మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు.

ఆ సమయంలో ఉదయం ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవిత రాత్రి వరకు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆమె ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తనపై విచారణ జరుగుతున్న తీరుపై ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అప్పట్లో కవిత అరెస్ట్ కాబోతోందని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత కేసు చల్లబడింది. తాజాగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. ఈడీ నోటీసులు అందుకున్న కవిత రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఆమె రేపు విచారణకు హాజరుకావడం అనుమానమే. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్ తో చర్చించి కవిత హాజరుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Amazon: ఈ తేదీ నుంచి ఆర్డర్ల డెలివరీకి రూ. 2000 నోటును అంగీకరించదు..

Exit mobile version