Site icon NTV Telugu

Off The Record : ఆ ఇద్దరి నేతల మనసు మారిందా..? మీ పని మీరు చూసుకోమన్నారా .?

Off The Recor Tbjp

Off The Recor Tbjp

తెలంగాణ బీజేపీలోని ఆ ఇద్దరు ముఖ్యులకు తత్వం బోథపడిందా? అసెంబ్లీ ఎన్నికల టైంలో హెలికాప్టర్స్‌ వేసుకుని తిరిగి మరీ నానా హంగామా చేసిన నేతలు ఇప్పుడెందుకు నియోజకవర్గం దాటి బయటికి రావడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా… యాక్ట్‌ లోకల్‌ అన్నట్టుగానే వ్యవహారం ఉంది ఎందుకు? ఇంతకీ… ముందు ఇంట గెలవాలనుకుంటున్న ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ మారు మనసుకు కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల అనుభవాలతో లోక్‌సభ విషయంలో ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటోంది తెలంగాణ బీజేపీ. మిగతా పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించింది. ఒక వైపు ప్రజల్లోకి వెళ్తూనే మరో వైపు అంతర్గతంగా చేయాల్సిన పనులు చేస్తోంది. వలసల మీద దృష్టి సారించడంతో పాటు ప్రచార పర్వంలో అభ్యర్థులకు ఎక్కడికక్కడ దిశా నిర్దేశం చేస్తున్నారు పార్టీ పెద్దలు. కానీ…. అసెంబ్లీ ఎన్నికల టైంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు కనుమరుగవడంపై పార్టీతో పాటు రాజకీయవర్గాల్లో సైతం విస్తృత చర్చ జరిగింది. నాడు ఎక్కే గాలి మోటర్‌, దిగే గాలి మోటర్‌ అన్నట్టుగా హెలికాప్టర్స్‌లో టూర్ల మీద టూర్లు వేసి తెగ ప్రచారం చేసిన ఇద్దరు ముఖ్య నేతలు ఇప్పుడు బయట కనిపించడం లేదు. సీనియర్స్‌ బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ అప్పట్లో కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాన్ని చుట్టేసి వచ్చారు.

కానీ… ఇప్పుడు మాత్రం ఆ ఇద్దరూ నియోజకవర్గం హద్దులు దాటి బయటికి రాకపోవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. కరీంనగర్‌లో బండి సంజయ్‌, మల్కాజ్‌రిగిలో ఈటల పోటీ చేస్తున్నారు. ఇద్దరికీ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో టైట్‌గా ఉండి బయటికి రావడం లేదా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అసెంబ్లీ ఎన్నికల చేదు అనుభవాలు గుణపాఠం నేర్పాయా అన్న ప్రశ్న సైతం వస్తోంది రాజకీయ వర్గాల నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌ కరీంనగర్‌ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేయగా… ఈటల రాజేందర్‌ హుజూరాబాద్, గజ్వేల్‌లో పోటీ చేశారు. ఈటల పోటీ చేసిన రెండు చోట్ల, బండి కరీంనగర్‌లో ఓడిపోయారు. నాడు తమ నియోజకవర్గాల్లో తిరుగుతూనే… రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు ఈ ఇద్దరు ముఖ్య నాయకులు. చివరికి రిజల్ట్‌ చూశాక రెండు పడవల మీద కాళ్ళు వర్కౌట్‌ కాలేదన్న నిర్ణయానికి వచ్చి.. ఇప్పుడు మంచం ఉన్నంతవరకే కాళ్లు ముడుచుకుందామన్న నిర్ణయానికి వచ్చి ఉండవచ్చన్నది లోకల్‌ టాక్‌. అప్పుడు ఇతర నియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్ళడంతో పోటీ చేసిన చోట మొదటికే మోసం వచ్చిందని, బయట కేటాయించిన టైమ్‌ని సొంత నియోజకవర్గాలకే కేటాయించి ఉంటే… ఫలితం మరోలా ఉండేదని పార్టీ పోస్ట్‌మార్టంలో తేలిందట. అందుకే పెద్దోళ్ళు సైతం ముందు మీ సంగతి చూసుకోండని చెప్పి ఉండవచ్చని గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే.. బండి, ఈటల ఇప్పుడు తాము పోటీ చేస్తున్న కరీంనగర్‌, మల్కాజ్‌గిరికే పరిమితం అయి ఉంటారని అంటున్నారు. మొత్తానికి ముందు ఏదేదో.. ఊహించేసుకుని తిరిగేసిన నేతలిద్దరికీ ఇప్పటికి జ్ఞానోదయం అయిందని, సర్సర్లే… ఎన్నెన్నో అనుకుంటాం… అంటూ సర్దుకుపోతున్నారని గుసగుసలాడుకుంటున్నాయి బీజేపీ వర్గాలు.

Exit mobile version