గోషామహల్ ఎమ్మెల్యే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా? పాపం రాజాసింగ్ అనే పరిస్థితి వచ్చిందా? ఆవేశం ఆయన కొంప ముంచిందా? తాను రాజీనామా చేసిన బీజేపీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? ఎవరివో రాజకీయ వ్యూహాలకు రాజా బలయ్యారా? క్షవరం అయితేగానీ… వివరం తెలీదన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి మారిపోయిందా? ఓన్లీ… హిందుత్వ అజెండాతో పనిచేస్తూ… రాజకీయంగా ముందుకు పోతున్న లీడర్ రాజాసింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఆ ఫైర్ బ్రాండ్‌కు ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ భయం పట్టుకుందట. తొందరపడి తన కోయిల ముందే కూసిందే అంటూ… తెగ ఫీలైపోతున్నారట. పార్టీగా బీజేపీ తనకు బలమా? లేక బీజేపీని తానే భుజాల మీద మోస్తున్నానా అన్న మీమాంసలో… పాపం… వాస్తవాలు తెలుసుకోకుండా కమలాన్నే తాను మోస్తూ భరిస్తున్నట్టు ఫీలైపోయి.. నా కోడి కూయకుంటే… తెలంగాణ బీజేపీకి తెల్లారదని అనుకుని పార్టీకి రాజీనామా చేసేశారు. కానీ… ఆ తర్వాతగానీ… అయ్యగారికి తత్వం బోధపడలేదట. తాను చేసిన తప్పేంటో… తొందరపాటు నిర్ణయానికి ఫలితం ఏంటో ఐ మ్యాక్స్ రేంజ్లో అయ్యగారికి బొమ్మ కనిపించి… ఇప్పుడు తాపీగా ఫీలవుతున్నారట. ఆ క్రమంలోనే… తిరిగి కమలం గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రాజాసింగ్ తాజా స్టేట్మెంట్స్ చూస్తుంటే.. ఆ విషయం అర్ధమైపోతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ తరపున మూడు సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజా.
మూడోసారి గెలిచాక… ఇక నాకేంటన్న ఓవర్ కాన్ఫిడెన్సో లేక మరో కారణమో గానీ…. పార్టీకి ఆయనకు మధ్య చాలా పెద్ద గ్యాపే వచ్చింది. రాష్ట్ర నాయకులు కొందరి మీద కోపం పెంచుకున్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. తనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇగ్నోర్ చేస్తున్నారని మొదలుపెట్టి… ముఖ్య నాయకుల్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక వర్గం మీద ఆయకున్న అసంతృప్తి, ఆగ్రహాన్ని వాడుకుని మరో వర్గం రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేసిందని, ఆ గేమ్‌లో రాజాసింగ్ పావుగా మారాడన్న అభిప్రాయం సైతం ఒక దశలో బలంగా ఉండే తెలంగాణ బీజేపీలో. అలాంటి రకరకాల కారణాలన్నీ కలగలిసి ఫైనల్‌గా పార్టీకి రాజీనామా చేశారు శాసనసభ్యుడు. కేంద్ర పార్టీ కూడా పెద్ద టైం తీసుకోకుండానే… అయన రాజీనామాను ఆమోదించింది. అలాగే లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలను సైతం తప్పుపట్టింది. కేంద్ర పార్టీ తన విషయంలో సానుకూలత వ్యక్తం చేస్తుందని అనుకున్నారని, చర్చల కోసం పిలిస్తే…. అన్ని అంశాలని అప్పుడే చెప్పాలని అనుకున్నారట. కానీ… రాజాసింగ్‌కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా… పార్టీ పెద్దలు రాజీనామా పత్రానికి స్టాంప్ వేసేయడంతో గతుక్కుమన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం చౌరస్తాలో ఉంది… బీజేపీని కాదని ఎటూ పోలేని పరిస్థితి. అక్కడ తప్ప ఇంకెక్కడా ఇమడలేడన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. పార్టీకి రాజీనామా విషయంలో వెనకా ముందు ఆలోచించని రాజాసింగ్… ఇప్పుడు మాత్రం స్వరం మార్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని పార్టీ చెబితే చేస్తానన్నది ఆయన లేటెస్ట్ వాయిస్. ఒకసారి రిజైన్ చేసేసి, దాన్ని హైకమాండ్ ఆమోదించాక… ఇక పార్టీ నిర్ణయంతో పనేంటన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అక్కడితో ఆగలేదు రాజాసాబ్. గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అడ్డా అని ఇప్పుడు చెబుతున్నారాయన. నేను వేరే ఏ పార్టీలో చేరబోనని కూడా అంటున్నారట. దీన్ని బట్టి చూస్తుంటే… తిరిగి పార్టీలోని వస్తానని సంకేతాలు పంపుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. క్షవరం అయితే గానీ… వివరం తెలీదన్న సామెత మనోడికి సరిగ్గా సరిపోతుందంటూ సెటైర్స్ కూడా వేసుకుంటున్నారట బీజేపీ నాయకులు కొందరు. ఈ తిప్పలకు బదులు… అసలు రాజీనామా ఆమోదం పొందక ముందే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల్ని కలిస్తే పరిస్థితి వేరుగా ఉండేది కదా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. సరే… జరిగిందేదో జరిగిపోయింది. తిరిగి బీజేపీకి జై కొడుతున్నాడు కాబట్టి… ఢిల్లీ నాయకత్వం కరుణిస్తుందో, లేదో చూడాలంటున్నారు. పార్టీకంటే వ్యక్తులు ముఖ్యం కాదన్న సంగతిని ఇప్పటికైనా ఆయన గుర్తిస్తే… బెటర్ అంటున్నారు టీజీ బీజేపీ నాయకులు. రాజకీయాల్లో ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యమన్న సంగతి తెలియకుంటే ఇలాగే ఉంటుంది, పాపం రాజాసింగ్ అన్నది పార్టీ లీడర్స్ వాయిస్.