తెలంగాణ అసెంబ్లీలో అధికారపక్షం పైచేయి సాధించగలిగిందా? ఇన్నాళ్ళు పట్టు విడుపులతో నడిచిన సభ క్రమంగా ఏకపక్షం అవుతోందా? ఆ విషయమై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎక్కడ విపక్షాన్ని డామినేట్ చేయగలిగింది అధికార పక్షం? మెయిన్ అపోజిషన్ ఎక్కడ కార్నర్ అయింది? అందులో కీలక పాత్ర ఎవరిది? తెలంగాణ అసెంబ్లీలో గడిచిన రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధించినట్లు కనపడుతోందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ సమావేశాలకు, ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాల్లో పనితీరుని బేరీజు వేసుకుంటే కొంత పట్టు సాధించినట్లు కనపడుతోందట. రెండు రోజులు అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుగా వ్యవహారం నడిచింది. సబిత ఇష్యూని అజెండాగా మార్చుకోవాలని డిసైడైంది బీఆర్‌ఎస్. అందులో భాగంగానే రెండో రోజు కూడా…. ఇష్యుూని రైజ్ చేసింది. ఐతే అదే సమయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రారంభం నుండి మొదలుకొని…బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేయడం…మహిళా సభ్యులు పోడియం ముందు నిరసన తెలపడం వంటి వాటినన్నిటినీ లైట్ తీసుకున్న అధికారపక్షం… స్కిల్ యూనివర్సిటీ బిల్లుకి ఆమోద ముద్ర వేయించుకోగలిగింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్నా… అన్ని పక్షాల సభ్యులతో మాట్లాడించింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడంతో….దాన్నో అస్త్రంగా మార్చుకుంది అధికార పార్టీ. సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ, సభలో అందరు సభ్యులతో మాట్లాడించాలని వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసింది సర్కార్. దీంతో సభలో సభ్యులు అదే అంశం మీద మాట్లాడాల్సి వచ్చింది.
బీఆర్‌ఎస్ సభ్యులకు మైక్ ఇచ్చినా… వారు కూడా కేవలం వర్గీకరణ అంశంపైనే మాట్లాడాలని కట్టడి చేయగలిదింది అధికారపక్షం. సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ పై మాట్లాడే ప్రయత్నం చేసినా.. సభాపతి కూడా సబ్జెక్ట్ నుంచి పక్కకు వెళ్లవద్దంటూ సభను కంట్రోల్ చేశారు. దీంతో… అటు సబిత ఎపిసోడ్‌లో గులాబీ దళాన్ని కట్టడి చేయడంతో పాటు ఇటు వర్గీకరణపై కూడా వాళ్ళకు వాదన లేకుండా చేయగలిగారన్న టాక్ మొదలైంది. ఈ క్రమంలోనే రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధిస్తోందన్న చర్చ మొదలైంది. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్ లో… డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కౌంటర్ టోటల్ ఎపిసోడ్‌లో హైలైట్. సబిత వ్యవహారంపై సిఎం రేవంత్ స్పందించిన తర్వాత.. సభ కొంత హీటెక్కింది. ఆ టెంపోని పీక్స్‌కు తీసుకువెళ్ళారు భట్టి. గతంలో సబిత కాంగ్రెస్‌ని మోసం చేశారన్న విషయాన్ని సభ సాక్షిగా ఆయన చక్కగా ఎస్టాబ్లిష్ చేయగలిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో. ఇక శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఫామ్‌లోకి వచ్చారని, భట్టి, శ్రీధర్ బాబు కలిసి రెండు రోజులుగా సభను పూర్తిగా అధికారపక్షానికి అనుకూలం చేయగలిగారని, దీన్ని బట్టి చూస్తుంటే… తొలుత కాస్త తొట్రుపడ్డా ప్రభుత్వం పైచేయి సాధించగలిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయ వర్గాల్లో.