పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తెలంగాణ సీఎం కసరత్తు మొదలుపెట్టారా? పాత వాసనలు లేకుండా అడ్మినిస్ట్రేషన్‌ను గాడిలో పెట్టాలని డిసైడయ్యారా? అందు కోసం ఎక్స్‌ట్రా కేర్ తీసుకోబోతున్నారా? ఏంటా ప్రత్యేక జాగ్రత్తలు? ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 17న మూడో విడత పోలింగ్ ముగియగానే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి… పరిపాలనా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట సీఎం రేవంత్ రెడ్డి. పదవి చేపట్టాక తొలినాళ్ళలో ఉండే బాలారిష్టాలను అధిగమించడం, తర్వాత వరుస ఎన్నికల్లాంటి వాటితో ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదదని, ఇక మీదట ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు పూర్తి స్థాయిలో అందాలంటే సమర్ధులైన అధికారులు ఉండాలన్న లక్ష్యంతో ఐఎఎస్‌లను బదిలీ చేయాలనుకుంటున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళయింది. ఇప్పటి వరకు చాలా శాఖల్లో ఉన్నతాధికారులను మార్చలేదు. ఇప్పటి వరకు ఫోకల్ పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ లనే మారుస్తూ వచ్చిన ప్రభుత్వం, ఈసారి నాన్ ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారికి కూడా స్థాన చలనం కల్పించేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.ఇక నుంచి పాలనను పరుగులు పెట్టించాలని భావిస్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కొన్ని సర్దుబాట్లు చేసుకునేందుకు సమయం ఇచ్చారని,ఇకపై పాలనలో తన ముద్ర వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టాలని అనుకుంటున్నట్టు చెబుతున్నాయి సచివాలయ వర్గాలు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి కింది వరకు అందర్నీ మార్చాలని నిర్ణయించుకుని ఆయా శాఖల నుంచి నివేదికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారట ముఖ్యమంత్రి.
ఆయన బాధ్యతలు తీసుకున్నాక కొన్ని శాఖలపై రివ్యూ నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులకు స్థాన చలనం కల్పించారు. అంతేగాక సీఎంవోలోకి కొంతమంది అధికారులను తీసుకుని వారితో పని చేస్తూ వస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలపై ఉన్నతాధికారులు ప్రజల్లో నమ్మకం కల్పించకపోతున్నట్టు భావిస్తున్నారట ముఖ్యమంత్రి. దీంతో సెక్రటేరియట్‌లో కూడా కొంతమంది సీనియర్ ఐఎఎస్‌లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.
సీఎంవో కార్యదర్శులను సైతం మార్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పలు విషయాల్లో ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించిన సీఎంవో అధికారిని సైతం బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అధికారే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ సర్కార్‌లో కూడా ఆయన మాటే ఫైనల్ అన్నట్టు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మరో సీనియర్ ఐఏఎస్‌ను సీఎంవోలోకి తీసుకుని కీలక భాద్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంవోలో తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే బయటకు తెలిసి పోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారట. లోపలి వాళ్ళే కొందరు బయటకు లీకులు ఇస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే… పలు జిల్లాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న కలెక్టర్లు, కేవలం క్యాంపు ఆఫీసులకే పరిమితం అయి ప్రజల మధ్యకు వెళ్లని వాళ్ళను కూడా మార్చబోతున్నారు. పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు గ్రేడింగ్, ర్యాకింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో పర్ఫార్మెన్స్ బాగోలేని కలెక్టర్లను పక్కకు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే కొద్ది మంది ఐఏఎస్ లను రహస్యంగా బదిలీ చేసింది ప్రభుత్వం. విషయం బయటకు పొక్కకుండా ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ నేరుగా సదరు అధికారులకు పంపించారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి, సింగరేణి సిఎండి బలరాం నాయక్ ను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరుతో ఆయన డిప్యుటేషన్ ముగిసిపోతుంది. రాబోయే మూడేళ్ళలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి. అందుకోసం విజన్ ఉన్న అధికారులకు ప్రాధాన్యం ఇచ్చి పని చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.