తెలంగాణ కాంగ్రెస్‌లో తల పండిన నాయకులు కూడా మాట్లాడలేని మాటల్ని ఆ యువ ఎమ్మెల్యే ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏకంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా… మాటల తూటాలు పేల్చడం ఆయన నైజమా? లేక వ్యూహమా? అదీ.. ఇదీ.. కాకుండా ఎవరో వేస్తున్న తాళానికి ఈయన రాగం ఆలపిస్తున్నారా? పార్టీని అంతలా ఇరుకున పెడుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? పదే పదే ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? జనంపల్లి అనిరుథ్‌రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా… జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో…. టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్ అవుతున్నారాయన. కేవలం తెలంగాణకు పరిమితం అవకుండా… ఏపీ లీడర్స్‌కు లింక్ పెట్టిమరీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొదట్లో అంటే ఓకేగానీ…. అదే పరంపర కొనసాగుతుండటం, తాజాగా అన్న మాటలు ఏకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండటంతో…పీసీసీ పెద్దలు కూడా ఎమ్మెల్యే వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు సమాచారం. సూటిగా, సుత్తి లేకుండా… కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతానని ఆయన అనుకుంటుండవచ్చుగానీ… ఇటు పార్టీ అధికారంలో ఉంది, నోటికి ఏమొస్తే అది మాట్లాడకూడదన్న విచక్షణ లేకుంటే ఎలాగంటూ కాంగ్రెస్ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అనిరుథ్‌రెడ్డి స్వతహాగానే… అలా మాట్లాడుతున్నారా? లేక వేరే ఎవరైనా… వెనకుండి మాట్లాడిస్తున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట పార్టీలో. దక్షిణ తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి ఒకరికి ఆయన అత్యంత సన్నిహితుడన్న ప్రచారం సైతం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాటలు, కదలికలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయట తెలంగాణ కాంగ్రెస్‌లో. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారట పార్టీ లీడర్స్. మరీ ముఖ్యంగా… ఇటీవల బనకచర్ల అంశానికి సంబంధించి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం కోవర్ట్‌లు ఉన్నారని, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, రోడ్డు కాంట్రాక్ట్‌లు చేసేది వాళ్ళేనని, అలాంటి వాళ్ళకి నల్లా, కరెంట్ కనెక్షన్స్ కట్ చేయాలని తుట్టెను కదిలించారాయన.
జడ్చర్ల ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యల్ని టీ పీసీసీ సీరియస్‌గానే తీసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే అన్న మాటలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి జులై ఏడున పార్టీ క్రమశిక్షణా కమిటీలో చర్చించబోతున్నట్టు తెలిసింది. దీంతో… ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీస్ ఇస్తారా? చర్యలకు సిఫారసు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే మాట్లాడారంటూ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నట్టు తెలిసింది. దానికి సంబంధించి నివేదిక తయారు చేయమని ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారట ఆయన. అనిరుథ్ వెనక ఎవరున్నారన్న విషయంలో కూడా పార్టీ పెద్దలు ఫోకస్ చేసినట్టు సమాచారం. గతంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ…. నలుగురు ఎమ్మెల్యేలతో అనిరుథ్ ప్రత్యేక సమావేశం పెట్టారు. అయితే… అప్పట్లో ఆయన లేవనెత్తిన అంశాల మీద పార్టీ కొంత సానుకూలంగా ఆలోచించిందట. కానీ… ఇప్పుడు… పార్టీలో టీడీపీ కోవర్ట్‌లు ఉన్నారని చేసిన కామెంట్స్ విషయంలో మాత్రం కాస్త లోతుగా అధ్యయనం చేయాలని పార్టీ పెద్దలు డిసైడైనట్టు సమాచారం. ఆ మాటల్ని ఉపేక్షిస్తే….నష్టం జరుగుతుందన్న అంచనాకు వచ్చారట గాంధీభవన్ లీడర్స్.
ఓవైపు బనకచర్ల ప్రాజెక్ట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా డీల్ చేస్తుంటే… దాన్ని పక్కదారి పట్టించేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలున్నాయని భావిస్తున్నారట. అలాగే ఇద్దరు బడా నేతల్ని ఇరుకున పెట్టే లక్ష్యంతో అలా మాట్లాడి ఉండవచ్చని కూడా పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అనిరుధ్‌రెడ్డి… తనకు అత్యంత సన్నిహితుడైన దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి కోసమే ఇదంతా చేస్తున్నారా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట గాంధీభవన్‌లో. గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే. ఇతర పార్టీల నుంచి చేరికలు మాకొద్దని స్టేట్‌మెంట్ ఇవ్వడం, పారిశ్రామిక వ్యర్ధాలను విచ్చలవిడిగా వదిలితే పరిశ్రమల్ని తగలబెడతానని వార్నింగ్ ఇవ్వడం, తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు ఆమోదించకుంటే ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వబోమని అనడం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తానేం అన్నా… పార్టీ పరంగా ఏం కాదు, తన గురువు చూసుకుంటారన్న ధీమాతోనే అలా మాట్లాడుతున్నారా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయట కాంగ్రెస్‌లో. ఇన్నాళ్ళ వ్యవహారాలు ఎలా ఉన్నా… ఇప్పుడు ప్రభుత్వమే ఇరకాటంలో పడేలా మాట్లాడారంటూ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయంపై ఆసక్తి పెరుగుతోంది కాంగ్రెస్ సర్కిల్స్‌లో,