దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో ఎన్టీవీ ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. తాను తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని.. ఇప్పుడు దేశం పనిచేయడానికి తనకు బీజేపీ అవకాశం ఇచ్చిందని తెలిపారు. తాను నూటికి నూరు శాతం బీజేపీలో కంఫర్ట్‌గానే ఉన్నానని స్పష్టం చేశారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానన్న వార్తలను రఘునందన్‌రావు ఖండించారు. మునిగిపోయే పడవ ఎక్కాలని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి పెరుగుతోందని ఆరోపించారు. ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ఎస్‌ఎమ్మెస్ చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.
బీజేపీలో టాలెంట్ ఉండి పనిచేసేవాళ్లకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చి పనిచేసిన వాళ్లను కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర బీజేపీలో ఉందని గుర్తుచేశారు. ఉదాహరణకు తీసుకుంటే అసోంలో హేమంత బిశ్వంత శర్మ గత పదేళ్లుగా పార్టీలో కష్టపడి పనిచేశారని.. ఇప్పుడు ఆయనకు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. బీజేపీలో తొలి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందనే వాదన తప్పు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పొలిటికల్ డైనమిక్స్ మారుతుంటాయని.. పార్టీ నిర్ణయాలు కూడా మారుతుంటాయని రఘునందన్‌రావు తెలిపారు. ఈరోజే పార్టీలోకి వచ్చి రేపే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఏ పార్టీలోనూ నెరవేరదని రఘునందన్‌రావు అన్నారు. రాజకీయాల్లో ఓపిక ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని అభిప్రాయపడ్డారు.
లక్ష్మణ్ తర్వాత తాను బీజేపీ అధ్యక్ష పదవి అడిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు బండి సంజయ్ నేతృత్వంలో పనిచేస్తున్నానని రఘునందన్‌రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీకి ఇప్పుడు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలం బండి సంజయ్ నేతృత్వంలో కలిసి పనిచేస్తున్నామని.. అందరం సమష్టిగా కలిసి నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్‌తో తనకు ఎలాంటి గొడవ లేదని.. అదంతా మీడియా ప్రచారమే అని కొట్టిపారేశారు. ప్రోటోకాల్ గురించి తానెక్కడా బహిరంగంగా మాట్లాడలేదన్నారు. మీటింగుల గురించి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందే తప్ప అది అసంతృప్తి కాదన్నారు. 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఇప్పటి వరకు దిక్కూ మొక్కు లేదని ఆరోపించారు. కేంద్రం పైసలు ఇస్తేనే నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పాడా అని ప్రశ్నించారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన వారికి టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం లభించలేదని.. ఉద్యమంలో పాలుపంచుకోని తలసాని, తుమ్మల, కడియం వంటి వాళ్లకు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం ఇచ్చి తమ లాంటి వాళ్లను పట్టించుకోలేదని రఘునందన్‌రావు విమర్శలు చేశారు.